యువనేత, మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను గుక్కతిప్పుకోనిచ్చేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న వరుస తుఫానుల ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కృష్ణానదీ తీరం సాక్షిగా లక్ష్యదీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.
ఆ తర్వాత కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. ఈ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయం, నష్టాన్ని ఢిల్లీ వీధుల్లో ఎలుగెత్తి చాటారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న పార్లమెంట్ స్ట్రీట్‌లో జలదీక్షను చేపట్టారు. లక్ష్యదీక్షతో పాటు జలదీక్షకు అపూర్వ స్పందన వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టాయి.
ఇపుడు ముచ్చటగా మూడోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సవాల్ చేసేలా పెట్రోల్ ధరల పెంపుపై సమరశంఖం పూరించారు. ఈనెల 22వ తేదీన విశాఖంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు జగన్ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ జిల్లాలో సాగిస్తున్న ఓదార్పు యాత్రలో భాగంగా మంగళవారం పాయకరావుపేటలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే పెరిగిపోయిన నిత్యావసరవస్తు ధరలతో సామాన్య ప్రజానీకం అష్టకష్టాలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ ధరలు చాలవన్నట్టుగా పెట్రోల్ ధరలు పెంచి మరింతగా ధరలు పెరిగేలా కేంద్ర చర్యలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల కష్టాలు తమకు పట్టవనే చందంగా ఆ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని జగన్ ఆరోపించారు.
ధరల పెరుగదలకు అడ్డుకట్ట వేయడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటేందుకు వీలుగా ఈనెల 22వ తేదీన ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. తాను సాగిస్తున్న ఓదార్పు యాత్రను 21వ తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించారు.