డీజిల్, పెట్రోల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న అమ్మకు పన్నులను తక్షణం తగ్గించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్ ధరలను పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయనే సాకుతో మరో విడత లీటర్ పెట్రోలుపై రూ.2.50 పెంచడం దారుణమన్నారు.
గత నెల రోజుల వ్యవధిలో చమురు కంపెనీలు పెట్రోలు ధరలను రెండు సార్లు పెంచి వినియోగదారులపై మోయలేని భారం మోపాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో అమ్మకాలపై పన్నులు తగ్గించి ప్రజలపై పడే భారాన్ని కొంత మేరకైనా ఆదుకోవాలని ఆయన సూచించారు.