తన తల్లి వైఎస్.విజయలక్ష్మిపై పోటీ చేస్తామని బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డి చెప్పడం సమంజసమా అని వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం తన సొంత పట్టణం పులివెందులలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అమ్మపై సోనియా గాంధీ కోసం బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డి పోటీ చేస్తామని చెప్పడం భావ్యమా అని అన్నారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడం తనను ఎంతగానో బాధ కలిగించిందన్నారు.
అంటే, దివంగత మహానేత వైఎస్‌కు ఆయన సోదరునిగా వైఎస్ వివేకా ఇచ్చే గౌవరం ఇదేనా అని జగన్ స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. అదేసమయంలో తాను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మాట ఇస్తున్నానని చెప్పారు.
చిన్న మాట కోసం ఎంపీ పదవిని వదులుకున్నానని జగన్ గుర్తు చేశారు. అలాగే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కొట్లాడేందుకు తాను ఏమాత్రం వెనుకంజ వేయబోనని ఆయన తేల్చి చెప్పారు. పులివెందులలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జగన్ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ తన బాబాయికి మంత్రి పదవి ఇచ్చి తమ కుటుంబాన్ని రెండుగా చీల్చారని జగన్ బాధపడ్డారు. జరగబోయే ఎన్నికలు సచ్ఛీలతకు, నీచ రాజకీయాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు.