Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెదేపాలో తెలంగాణ లొల్లి: పోచారం బాటలో సుద్దాల దేవయ్య!!

తెదేపాలో తెలంగాణ లొల్లి: పోచారం బాటలో సుద్దాల దేవయ్య!!
, మంగళవారం, 4 జనవరి 2011 (12:23 IST)
తెలుగుదేశం పార్టీ తెలంగాణ లొల్లితో సతమతమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంత నేతలకు ప్రాణ సంకటంగా మారింది. తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం కృషి చేయాలంటూ స్థానిక కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దీంతో దిక్కుతోచని పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గాల్సి వస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తెదేపాను వీడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఇలాంటి వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ కోవలో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఇపుడు ముందు వరుసలో ఉన్నారు. ఆయన సోమవారం తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తెదేపాను వీడి కేసీఆర్ నేతృత్వంలోని తెరాసతో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన బాన్సువాడలో ప్రకటించినప్పటికీ.. అధికారికంగా వెల్లడి కావాల్సింది.

తాజాగా పోచారం బాటలోనే చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కూడా పయనిస్తున్నట్లు సమాచారం. సుద్దాల దేవయ్య కూడా తెదేపాను వీడి కారులో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుద్దాల దేవయ్య భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని ఆయన ప్రకటించడం గమనార్హం.

అంతేకాకుండా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కూడా తెదేపాను వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై వివరణ ఇచ్చేందుకు ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu