ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సల్స్ అజెండాను అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్, తెలంగాణ అనే అంశాలను వేర్వేరు కాదన్నారు. అందువల్ల రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే నక్సల్ అజెండాను అమలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
మాజీ నక్సలైట్ సాంబశివుడు సోమవారం తెరాసలో చేరిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్సలైట్స్, తెలంగాణ రెండు అంశాలు వేర్వేరు కాదన్నారు. అందువల్ల నక్సల్స్ అజెండా తెలంగాణతోనే కలిసుంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నక్సలైట్స్ అజెండా అమలు చేస్తామన్నారు. పేదరికంతో ఆకలికి అలమటించలేకే భుజాన తుపాకీ వేసుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా దోబూచులాడుతోందని ఆరోపించారు. గత యేడాది తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో పుట్టగతులుండవని కేసీఆర్ జోస్యం చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈనెల ఆరో తేదీన ఢిల్లీలో జరుగనున్న అఖిలపక్ష భేటీకి తాము వెళ్లడం లేదన్నారు. ఈ సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.