Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి చుట్టూ పరిభ్రమిస్తున్న రాష్ట్ర రాజకీయాలు: గంటా

Advertiesment
చిరంజీవి
, సోమవారం, 3 జనవరి 2011 (14:38 IST)
రాష్ట్ర రాజకీయాలు పార్టీ అధినేత చిరంజీవి చుట్టూ పరిభ్రమిస్తున్నాయని, మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో ప్రరాపా అత్యంత బలమైన శక్తిగా అవతరించనుందని ఆ పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ అంతర్గత కుమ్ములాటలు, కుర్చీల మార్పులతో సతమతమవుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు.

పది మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రిపై అసంతృప్తిని వ్యక్తం చేయడం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. రైతుల పార్టీగా నమ్మకాన్ని పొందాలనుకున్న తెలుగు దేశాన్ని కూడా జనం నమ్మలేదన్నారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజయవాడలో చేపట్టిన లక్ష్యదీక్షతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుదేలైపోయాయన్నారు.

ప్రధానంగా ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారన్నారు. అందువల్ల ప్రజలు ప్రజారాజ్యంపైనే ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈ తరుణంలో ప్రజల నమ్మకాన్ని తమ పార్టీ తప్పక నిలబెడుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో కార్యాచరణ మరింత పటిష్టంగా అమలు పరుస్తున్నామన్నారు. నియోజక వర్గ, మండలస్థాయిలో కమిటీలు పూర్తయ్యాయని, వార్డుల వారీగా కమిటీల నియామకాలు కూడా వారం రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu