ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గారు. రైతు సమస్యలపై ఎనిమిది రోజుల పాటు తెదేపా అధినేత నిరాహారదీక్ష చేస్తే ఏమాత్రం స్పందించని ఆయన.. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు చేసిన ఒత్తిడికి మెట్టుదిగక తప్పలేదు.
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయంలో విద్యార్థులపై బనాయించిన కేసులను ఎత్తివేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, కేసుల ఎత్తివేయాలని విద్యార్థులు నిరాహారదీక్షలు చేసినా గత యేడాది కాలంగా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం.. సొంత పార్టీ ఎంపీల దెబ్బకు దిగివచ్చింది.
విద్యార్థులపై పెట్టిన కేసుల్లో న్యాయపరమైన చిక్కులు లేని 90 శాతం కేసులను ఎత్తేవేసేందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం. ఈ అంశంపై ఎంపీలు, ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.జానారెడ్డి, బస్వరాజు సారయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు ఫలించాయి.
పది శాతం కేసుల విషయంలో మాత్రం చిక్కుముడి నెలలకొనివుంది. ఈ కేసులపై కూడా ఎంపీలు పట్టుబడుతారా లేక చల్లబడుతారా అనేది తేలాల్సి వుంది. ప్రభుత్వం మాత్రం దీక్ష విరమింపజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా దీక్షకు దిగుతామని హెచ్చరించినట్టు వినికిడి. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెత్తబడినట్టు తెలుస్తోంది.