Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్-జగన్‌ల స్నేహబంధం: మారనున్న రాజకీయ సమీకరణ!!

Advertiesment
కేసీఆర్-జగన్‌ల స్నేహబంధం: మారనున్న రాజకీయ సమీకరణ!!
తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు, కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డిల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. రాష్ట్ర విభజన జరిగినా.. జరుగక పోయినా ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా వీరిద్దరి స్నేహబంధం కొనసాగనుంది. ఈ రాజకీయ కొత్త సమీకరణాలు కొత్త సంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండగా తెరాస రాజకీయ ఉద్యమం చేస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో కాంగ్రెస్ అధిష్టానానికి తగిన గుణపాఠం నేర్పాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన కేసీఆర్‌తో చేతులు కలిపేందుకు సైతం వెనుకంజ వేయడం లేదు.

వాస్తవానికి తెలంగాణలో వైఎస్ అభిమానులు ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన ఎక్కువగా పర్యటించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇరువర్గాలకు చెందిన కీలక నేతలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి. జగన్‌కు తెలంగాణ ప్రాంతంలోకంటే సీమాంధ్రలోనే ఎక్కువ మద్దతు లభిస్తోంది. రాష్ట్ర విజభన జరిగితేనే సీమాంధ్రలో జగన్ పార్టీకి రాజకీయంగా మరింత ప్రయోజనం. తెరాసకు కావలసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.

కాబట్టి రాష్ట్ర విభజన జరిగితేనే తెలంగాణలో తెరాసకు, సీమాంధ్రలో జగన్‌కు వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఈ అంశమే కేసీఆర్, జగన్‌ల మధ్య అవగాహన కుదరడానికి ఏకైక కారణంగా భావిస్తున్నట్టు వారు చెపుతున్నారు.

పైపెచ్చు.. కేసీఆర్ లేదా జగన్‌లు ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు గుప్పించుకోవడంలేదు. ఇద్దరి మధ్య అవగాహన కుదరడం వల్లే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో తెరాస, జగన్ పార్టీ కలిసినట్లయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ చిక్కుల్లో పడతాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తెరాసతో జగన్ పార్టీ పొత్తు పెట్టుకుని, కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్ర విజభన తర్వాత తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. జగన్‌కు చెందిన మీడియాలో కూడా తెరాసకు, కేసీఆర్‌కు మంచి ప్రచారమే ఇస్తోంది. తెలంగాణ అంశం తన చేతుల్లో లేదని కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని జగన్ తేల్చి చెప్పారు.

అందువల్ల తాను తెలంగాణకు వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపారు. దీంతో జగన్‌ పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారుతాయో నిశితంగా పరిశీలించాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu