రైతు సమస్యలపై గత మూడు రోజుల క్రితం నిరవధిక నిరాహారదీక్షను చేపట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీక్షను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో సోమవారం తెల్లవారు జామున రంగ ప్రవేశం చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. దీక్షకు చేపట్టినందుకు చంద్రబాబుతో పాటు ఆయనకు సంఘీభావం ప్రకటించిన ఆయన కుమారుడు లోకేష్‌పై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేశారు.
ఇదిలావుండగా, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలకు దిగారు. బాబు ఉన్న నిమ్స్ ఆస్పత్రి వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా, బాబు అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు దుకాణాలు, విద్యాసంస్థలను బలవంతంగా మూసి వేయించారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకుని నిలుపుదల చేశారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధం చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.