ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం అనంతరం తయారు చేసిన నివేదిక సిద్ధంగా ఉందని, డిసెంబరు 31వ తేదీకి ముందు ఎపుడైనా కేంద్రానికి సమర్పించవచ్చని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వీకె.దుగ్గల్ తెలిపారు. కాగా, అధ్యయనం సమయంలో తమకు అన్ని విధాలుగా సహకరించిన అన్ని పార్టీల నేతలకు ఈనెల 16వ తేదీన విందు ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇందుకోసం ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌కు రానున్నట్టు చెప్పారు. రాష్ట్రం నలుమూలల పర్యటించి ప్రజల మనోభావాలను తెలుసుకున్న ఐదుగురు సభ్యుల శ్రీకృష్ణ కమిటీ ఒక నివేదికను తయారు చేసింది. ఈ నెల 16న కమిటీ సభ్యులందరూ హైదరాబాద్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయి గత పది నెలలుగా తమ అధ్యయనంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తారన్నారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. అయితే, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడులు హాజరవుతారా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది.