Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మూడు పదవుల ఖరారు కోసం సీఎం ఢిల్లీ పర్యటన!

Advertiesment
ఆ మూడు పదవుల ఖరారు కోసం సీఎం ఢిల్లీ పర్యటన!
ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ అధిష్టానం భారీగానే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత దెబ్బతిన్నదనే అపవాదును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూటగట్టుకున్నారు. దీంతో పై మూడు పదవుల విషయంలో ఇలాంటి తరహా అపవాదులు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండాలని ఆయన భావిస్తున్నారు.

ఇందుకోసం అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీలతో ఆయన భేటీ అవుతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులో సామాజిక సమతౌల్యం లోపించటంపై తీవ్ర వివాదం చెలరేగిన నేపథ్యంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ దానిపై తీవ్రంగా చర్చించినట్టు వార్తలు వచ్చాయి.

అదేసమయంలో ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ వ్యక్తికి ఇస్తామని కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రకటించారు. కానీ, ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా సున్నితమైన వాతావరణం నెలకొని వుంది. దీంతో కీలక పదవులుగా భావించే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్, పీసీసీ చీఫ్‌ పదవులను ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది.

ఈ మూడు అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి భవిష్యత్ మార్గదర్శనం కోసం ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. పైపెచ్చు.. శాఖల కేటాయింపు తర్వాత మంత్రులు తమ అసంతృప్తి గళాన్ని వినిపించారు. దీంతో వీరిని బుజ్జగించేందుకు శాఖలు మార్చాలా, లేదంటే ఉన్న శాఖలకు అదనపు శాఖలు కేటాయిస్తే సరిపోతుందా అనే అంశంపై కూడా కేకేఆర్ అధిష్టానంతో చర్చలు జరుపనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu