వైఎస్.జగన్మోహన్ రెడ్డి-వైఎస్.వివేకానంద వర్గీయులకు ప్రత్యక్ష యుద్ధం ఆరంభమైంది. వైఎస్.వివేకా మంత్రి పదవికి చేపట్టాడాన్ని జగన్ వర్గీయులు జీర్ణించుకోలేక పోయారు. గురువారం ఉదయం జగన్‌తో భేటీ అయ్యేందుకు వచ్చిన వివేకాకు జగన్ వర్గీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్ వర్గీయులు డిమాండ్ చేస్తూ ఆయన కారును అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం రగిలిపోయిన వైఎస్.వివేకా కారు డోర్ తీసి వెలుపలికి వచ్చి మీసం మొలేస్తూ వేలు చూపిస్తూ హెచ్చరించారు. దీంతో రెచ్చిపోయిన జగన్ వర్గీయులు తోలుతీస్తామంటూ హెచ్చరించారు.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు కూడా పూర్తికాకముందే.. జగన్ వర్గీయుల నుంచి వివేకాకు నిరసన గళం ఎదురుకావడం గమనార్హం. ఒక దశలో రాయలసీమ పౌరుషం చూపిస్తామంటూ ఒకరినొకరు హెచ్చరికలు జారీ చేసుకోవడం గమనార్హం.
ఆ తర్వాత మంత్రి వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌తే భేటీ అయ్యేందుకు ఆయన నివాసానికి వచ్చినట్టు చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ, కొన్ని పత్రికల్లో తమ ఫ్యామిలీ కలహాలు ఉన్నట్టు వచ్చిన వార్తలు అవాస్తమన్నారు.
రాజకీయాలకు, కుటుంబాలకు ముడిపెట్టరాదన్నారు. ఈ రెండింటింనీ వేర్వేరు కోణాల్లో చూడాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు రాజకీయంగా వేరుపడినా కుటుంబాలు కలిసి ఉన్న విషయాన్ని వివేకా గుర్తు చేశారు.