కడప ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. ఆమెపై నేరుగా విమర్శలు గుప్పించారు. తమ కుటుంబాన్ని చీల్చేందుకు తన బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డిని పావుగా వాడుకుని, కుటుంబంలో చిచ్చుపెట్టారని జగన్ ఆరోపించారు.
ఆయన బుధవారం కడపలో మాట్లాడుతూ తనకూ తన బాబాయికి మధ్య వాగ్వాదం, ఘర్షణలు జరిగినట్టు కొన్ని దినపత్రికల్లో వార్తా కథనాలు విస్మయానికి లోను చేసినట్టు చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఇడుపులపాయ, కడపలలో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదన్నారు.
బాబాయ్ అంటే తనకు ఇప్పటికీ.. ఎప్పటికీ ఎంతో గౌరవమేనన్నారు. ఆయనను మా కుటుంబ సభ్యుడిగానే పరిగణిస్తానని చెప్పారు. అయితే మా కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు ఆయనను పావుగా వాడుకున్నారని జగన్ ఆరోపించారు.