ముందుగా ప్రకటించినట్లే తెలంగాణకు చెందిన వ్యక్తికే డిప్యూటీ సీఎం పదవిని అప్పగించనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త మంత్రివర్గం బుధవారం కొలువుదీరిన నేపథ్యంలో, మంత్రి పదవులు దక్కని అసంతృప్తి వాదులను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జిగించే ప్రయత్నం చేస్తోందని సమాచారం.
ఇంకా ఈ సాయంత్రానికి మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పీసీసీ, స్పీకర్, డిప్యూటీ సీం పదవులకు కులాలు ప్రాంతాల ఆధారంగా త్వరలో ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో పాటు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.