వచ్చే 2014 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 41 ఎంపీ సీట్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు కృషి చేస్తామని కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత మాట్లాడే మీడియా సమావేశంలో మాట్లాడేటపుడు వళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ కొత్త సీఎంను గరీబోళ్ళ బిడ్డగా అభివర్ణించారు. ఈయన వల్ల తెలంగాణ రాష్ట్ర సాధ్యం కాదని తేల్చిపారేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేది ఒక్క కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉందన్నారు. పైపెచ్చు వచ్చే 2011లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కేసీఆర్ జోస్యం చెప్పారు.
డిసెంబర్ 9వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన భారీ బహిరంగ సభ ఢిల్లీ పెద్దల దిమ్మదిరిగేలా ఉంటుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. అదేరోజు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలావుండగా, వరంగల్ సభ కోసం తెరాస నేతలు 2.50 కోట్ల నిధులను చందాలు, కూలీల రూపేణ సేకరించినట్టు ఆయన తెలిపారు.