కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజీనామా పార్టీకి తీరని నష్టమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పష్టం చేశారు. ముఖ్యంగా, జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని తాను ఊహించలేదన్నారు. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
జగన్ రాజీనామాపై సబ్బం హరి న్యూఢిల్లీ నుంచి స్పందిస్తూ.. జగన్ రాజీనామా ఒక దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. జగన్ రాజీనామాకు సంబంధించి ఐదు పేజీల లేఖను రాశారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఈ లేఖను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పుకొచ్చారు.
పార్టీకి ఎలాంటి నష్టం చేకూర్చని రీతిలోనే ఒంటరిగానే వెళ్లిపోతున్నట్టు జగన్ తన లేఖలో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇకపోతే.. ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు సబ్బం హరి ప్రకటించారు. ఈ అంశంలో అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే తామే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఇదే అంశంపై పార్టీ అధినేత్రితో భేటీకానున్నట్టు తెలిపారు. ప్రరాపాకు మాత్రం కేబినెట్‌లో చోటు కల్పిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలతో పాటు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొడతామని బహిరంగ సభల్లో ప్రచారం చేసిన పార్టీతో ఎలా దోస్తీ కుదుర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా, గత అసంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన చిరంజీవితో ఎలా జతకడతారని సబ్బం ప్రశ్నించారు.