రాష్ట్రంలో గత 14 నెలలుగా సాగుతూ వచ్చిన జగన్నాటకానికి తెరపడింది. అనుకున్నట్టుగానే కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టడం ఖాయమని తేలిపోయింది. దీన్ని ధృవీకరించేలా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కడప ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తనయుడి బాటలోనే పులివెందుల శాసనసభ సభ్యత్వానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.విజయలక్ష్మి కూడా రాజీనామా చేశారు. ఆమె కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గత 14 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు తనను ఎంతగానే అవేదనకు గురి చేశాయని, వీటిని జీర్ణించుకోలేకే రాజీనామా చేస్తున్నట్టు జగన్ విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా పదవుల ఆశచూపి తన కుటుంబంలో చిచ్చురేపుతారా అని జగన్ ప్రశ్నించారు. నన్ను ఒంటరిని చేసి పార్టీ నుంచి బయటకు పంపాలని నిర్ణయించారన్నారు. ఇందుకోసం సాక్షి కథనాన్ని భూతద్దంలో చూపించారన్నారు.
అదేసమంయలో తాను వ్యక్తిగతంగా ఆవేదన చెందే రాజీనామా చేశానని, అందువల్ల పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా.. నేను ఏం నేరం చేశాను. నా మీద ఎందుకు ఇంత కక్ష అంటూ ప్రశ్నించారు. తనను ఒంటరిని చేసి బయటకు పంపాలని నిర్ణయించారని అందుకే నేనే ఒంటరిగా బయటకు వెళుతున్నానని ప్రకటించారు.
అలాగే, తనపై వ్యతిరేక కథనాలను ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేయించారన్నారు. దివంగత తన తండ్రి హఠాన్మరణం అనంతరం ముఖ్యమంత్రిగా రోశయ్య పేరును 150 మంది ఎమ్మెల్యేల అభీష్టం మేరకు తాను సీఎం పేరును ప్రతిపాదించానని గుర్తు చేశారు. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం చెప్పినట్టుగానే నడుచుకున్నట్టు జగన్ తన లేఖలో పేర్కొన్నారు.