అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన ప్రభుత్వ సలహాదారు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కిరణ్ కుమార్ మంత్రివర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతోపాటు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సలహాదారు వ్యవస్థను రద్దు చేసింది. ఫలితంగా కేవీపీతో పాటు.. ఎనిమిది మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
దీనిపై ఆదివారం ముఖ్యమంత్రి కేకేఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ సలహాదారులందరూ రాజీనామాలు చేయాలని కోరామని ఆ ప్రకారంగా వారంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే సలహాదారులు తమతమ పదవులకు రాజీనామాలు చేశారు. వైఎస్ నియమించిన సలహాదారుల్లో ఎక్కువగా డాక్టర్ కేవీపీపైనే ఆరోపణలు వచ్చాయి. ఈ సలహాదారు వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనం లేకున్నా.. కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి.
పైపెచ్చు.. రాష్ట్ర హోంశాఖను శాసించే స్థాయిలో ఈ బాధ్యతలు ఉండడంతో .. ముఖ్యమంత్రికి సమాంతరంగా శాంతి భద్రతలు కేవీపీ వ్యవహరిస్తున్నారంటూ విపక్ష నేతలతో పాటు.. స్వపక్షం నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ఫలితంగా ఈ సలహాదారు వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఒక విధంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో సలహాదారు వ్యవస్థ రద్దు కావడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ రాజానామాలు చేసిన వారిలో రాజకీయ సలహాదారు, ప్రజా భద్రతా వ్యవస్థ చైర్మన్ డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు, వ్యవసాయ టెక్నాలజీ మిషన్ వైస్ ఛైర్మన్ సోమయాజులు, విదేశీ పెట్టుబడుల సలహాదారు సీసీ రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారు డాక్టర్ సీఎస్‌రావు, పరిశ్రమల శాఖ సలహాదారు పీటర్ హాసన్, రైల్వే, మునిసిఫల్ సలహాదారు స్టాన్లీ బాబు, ఆర్ అండ్ బి సలహాదారు ఎఫ్‌సీఎస్ పీటర్, పర్యాటక సలహాదారు కిషన్‌రావు, వ్యవసాయ సలహాదారు రౌతు సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.