రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం సమూల మార్పులు సంతరించుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గంలో వైఎస్ జగన్ వర్గానికి పూర్తి మొండిచేయి చూపించినట్లు తెలిసింది.
కాగా మొత్తం ఎమ్మెల్యేలలో ఎవరు జగన్‌కు పూర్తి మద్దతు పలుకుతున్నారన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని తొలిదశ మంత్రివర్గ జాబితాలో 12 మంది వ్యక్తులు పేర్లు ఖరారైనట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సోనియా గాంధీ నుంచి ఈ జాబితాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ అహ్మద్ పటేల్ భేటీతో మంత్రివర్గ రూపు ఏమిటన్నది తెలిసిపోనుంది.
అంతకుముందు శనివారం ఉదయం హస్తినకెళ్లిన ముఖ్యమంత్రి తొలుత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో 30 నిమిషాలు సమావేశమయ్యారు. ఆ తర్వాత సోనియా గాంధీతో 20 నిమిషాలు, కేంద్ర హోం మంత్రి చిదంబరం, ఏకే ఆంటోనీలతో సమావేశమయ్యారు. మొత్తమ్మీద మంత్రివర్గ కూర్పు అధిష్టానం సూచనలు, అభిప్రాయాలతో తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.