ఫ్రీ జోన్ వ్యవహారాన్ని పరిష్కరించకుండా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వ విద్యాలయ ఐక్య కార్యాచరణ కమిటీ (ఓయూజేఏసీ) ఆందోళన ఉధృతం చేస్తోంది. ఫ్రీజోన్ అంశం తేలిన తర్వాతే ఎస్సై నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఓయూజేఏసీ విద్యార్థులు గురువారం తార్నాక వరకు ర్యాలీ చేపట్టారు.
ర్యాలీ తార్నాక వద్దకు చేరుకోగానే విద్యార్థులు అక్కడి దుకాణాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలపై రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జితో విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థుల ఆందోళనతో తార్వాక చౌరాస్త వద్ద ట్రాఫిక్‌ను మళ్లించారు.
అంతకుముందు ఓయూజేఏసీ విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. కానీ పోలీసులు విద్యార్థులను రాజ్‌భవన్ వరకు రానీయకుండా అరెస్ట్ చేశారు.
మరోవైపు ఎస్సై రాత పరీక్షలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య కాన్వాయ్‌కు సంగారెడ్డిలో ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.