తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి పరస్పరం మద్దతు పలుకుతూ ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. శనివారం అమరవీరులకు నివాళులర్పించిన తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు ఢిల్లీలో ధర్నాకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
తెలుగుదేశం చేపట్టనున్న ధర్నాను తాను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు వ్యాఖ్యానించారు. అంతేకాదు తెలంగాణా సాధనకోసం తమవెంట తెలుగు తమ్ముళ్లు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
డిసెంబరు దాకా తెలంగాణాకోసం ఆగటం ఎందుకనీ, అంతకంటే ముందే తెలంగాణా రావాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ధర్నాకు తాను పూర్తి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. అంతేకాదు తెలంగాణాకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
తెలంగాణా వస్తే తెలంగాణాలోని తెదేపా-కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు ఏకమవుతారేమోనని చాలామంది బహిరంగంగానే అనుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరన్నట్లు అది కూడా జరుగుతుందేమో చూద్దాం.