రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంలో విలీనం చేయాలని చెప్పడం ఒక రాజకీయ నేతగా వెల్లడించిన అభిప్రాయం కాదని, ఒక సాధారణ సీమవాసిగా చెప్పానని మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ఇందులో ఎలాంటి స్వలాభాలు లేవన్నారు.
రాష్ట్రం విడిపోతే సీమ ప్రాంతానికి ఎదురయ్యే నీటి సమస్యలపై ఆందోళన చెందే సామాన్య వ్యక్తిగా చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉన్న సంస్కృతితో పాటు.. ఇతర పోలికలను ఆయన వివరించనున్నారు.
రాయలసీమ రీజియన్ ఒకపుడు నిజాం పాలనలో ఉండేదని ఆ తర్వాత బ్రిటీష్ రాజు పాలనలోకి ఎలా వెళ్లిందనే విషయంపై ఆయన వివరించనున్నారు. అలాగే, ఈ రెండు ప్రాంతాల్లో ఉండే సంస్కృతీ సంప్రదాయాలను కూడా గుర్తు చేయనున్నారు. ప్రధానంగా, సీమ, తెలంగాణలలో కల్లు ఏ విధంగా ప్రాచూర్యం పొందిందో కూడా ఆయన వివరించనున్నారు.
అంతేకాకుండా, ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలు విశాల భావాలు కలిగిన వారే కాకుండా ముక్కుసూటి మనుషులన్నారు. అందువల్లే రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో ఉంచాలని ఒక రాజకీయనేతగా కాకుండా, సాధారణ సీమవాసిగా కోరుతున్నట్టు చెప్పారు.