తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ వాదులే అడ్డుతగులుతున్నారని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కీ ఆరోపించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగలే ప్రధాన అడ్డంకిగా ఉన్నారన్నారు.
తాము రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తాము విశ్రమించబోమన్నారు. అయితే, తమ లక్ష్య సాధనలో కొందరు తెలంగాణ వాదులే అడ్డు తగులుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.
ఇకపోతే.. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులు చేరినట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇందులో మావోలు ఉన్నదీ లేనిదీ పోలీసులే తేల్చాలని చెప్పారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ అవుతుందని డీజీపీ గిరీష్ కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇవి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవిగా ఉన్నట్టు తెలిపారు.