తెలంగాణా ఆందోళన ఒకవైపు, పెంచిన బస్సు చార్జీలు మరోవైపు సీమాంధ్ర ప్రయాణికుడిని నగరంలోనే కట్టేశాయి. సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా లక్షల మంది సీమాంధ్రకు వెళ్లి బంధుమిత్రులతో సంబరాలు చేసుకునేవారు. కానీ ఈ సంక్రాంతి పండుగకు మాత్రం ఎక్కడివారక్కడే ఇళ్లకే పరిమితమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర రోడ్డు రవాణా లెక్కల ప్రకారం ఈ సీజన్లో హైదరాబాదు నుంచి ప్రతి ఏటా సుమారు 20 లక్షల మంది ప్రజలు సీమాంధ్రకు వెళ్లేవారు. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 14 లక్షలు కూడా దాటలేదని చెపుతున్నారు. తెలంగాణా రాకపోతే ఆంధ్రలోనే ఉండిపోండంటూ ప్రయాణికులను కొందరు తెలంగాణా అనుకూలురు హెచ్చరించడం ఒక కారణమైతే, పెంచిన బస్సు చార్జీలు మరొక కారణమయ్యాయని అంటున్నారు.
సంక్రాంతి పండుగ దృష్ట్యా ఆర్టీసీ సుమారు 4వేల ప్రత్యేక సర్వీసులను నడపాలని నిశ్చయించుకున్నా, రద్దీ అంతగా లేకపోవడంతో ఆ సంఖ్యను రెండువేలకు కుదించుకుంది. ఆర్టీసీ చార్జీలు పెరగటం వల్ల సామాన్యుడు రాజధాని నుంచి సొంత ఊరుకు వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నగరంలోని ఆయా షాపులు కూడా వెలవెలబోయాయి. సంక్రాంతి పండుగ కొనుగోళ్లు అనుకున్నంత జోరుగా లేవని వ్యాపారులు వాపోతున్నారు.