సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న తెలుగుదేశ పార్టీ మహిళా సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఆవరణలోకి ఆమె వెళుతున్నారన్న అభియోగంపై ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే, మరికొంతమంది తెదేపా నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉధృతంగా ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే. వీరిపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల వైఖరిపై రాజకుమారి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలతో అట్టుడికిపోతున్నందున ఎస్కే వర్శిటీలో 144 సెక్షన్ విధించారు.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పరామర్శించేందుకు ఆమె విశ్వవిద్యాలయం ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ఈ సందర్భంగా రాజకుమారి డిమాండ్ చేశారు.
అంతకుముందు.. సమైక్యాంధ్రకు అనుకూలంగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇతర తెదేపా ఎమ్మెల్యేలను ఆమె పరామర్శించి సంఘీభావం వెల్లడించారు.
కొద్దిసేపు దీక్షా శిబిరంలోని దీక్షాపరులతో, తెదేపా నాయకులో మాట్లాడిన అనంతరం ఆమె విశ్వవిద్యాలయానికి బయలుదేరారు. అయితే నిషేధాజ్ఞలు ఉన్నందున అనుమతి లేదని పోలీసులు నన్నపనేనిని మార్గమధ్యలోనే అరెస్ట్ చేశారు.