రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించడానికి గల కారణాలపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం సాయంత్రం పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్లారు. మరుసటి రోజు అంటే.. మంగళవారం మంత్రి బొత్సను హుటాహుటిన ఢిల్లీకి పిలువనంపారు. బొత్సను అంత హడావుడిగా పిలిపించడానికి కారణాలు ఏమై ఉంటాయని కాంగ్రెస్ నేతలు తమలో తాము చర్చించుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బొత్స సత్యనారాయణ బలీయమైన నాయకుడిగా ఉన్నారు. ఆయనకు పదిహేను మంది ఎమ్మెల్యేల మద్దతు సైతం ఉంది. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ కూడా లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి మూడు టిక్కెట్లు (రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ) పొందిన నేత బొత్స కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆయన కీలకమైన పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. వైఎస్‌కు ఎంతో అనుకూలంగా ఉన్న బొత్స, ఆయన దుర్మరణం పాలైన తర్వాత వైఎస్ వర్గంపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి హుటాహుటిన రావాల్సిందిగా పీసీసీ చీఫ్ ఆహ్వానించడం చర్చనీయాంశం గమనార్హం.
మరోవైపు.. వైఎస్ దుర్మరణం అనంతరం కాంగ్రెస్‌లో గ్రూపులు కట్టడం ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న బొత్సను మచ్చిక చేసుకుంటే భవిష్యత్‌లో తనకు అనుకూలంగా తిప్పుకోవచ్చని డీఎస్ వ్యూహంలో భాగమై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు. ఏది.. ఏమైనా బొత్స-డీఎస్ స్నేహంపై పలువురు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు.