దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క పదవి మినహా ఇతర పదవులు ఎన్ని ఇచ్చినా తక్కువేనని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ ముఖ్యమంత్రి జగనేనన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు ఆ పదవి మినహా ఏ పదవి ఇచ్చినా తక్కువగానే ఉంటుందన్నారు. ఇకపోతే.. తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఫ్రీ జోన్ అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నారని ఆరోపించారు.
ఈ మధ్య కాలంలో కేసీఆర్ వ్యాఖ్యలు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందన్నారు. త్వరలోనే తెరాస అసమ్మతి వర్గానికి చెందిన నేతలంతా జగన్‌తో భేటీ కానున్నట్టు రెహ్మాన్ తెలిపారు.
మరో సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడే భాష రాష్ట్ర ప్రజలను, తెలుగు భాషను కించపరిచే విధంగా ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.