దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కంచుకోట పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఇక్కడ పోటీ చేయరాదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వేచిచూసే ధోరణి అవలంభించి, చివరి నిమిషంలో ఓ నిర్ణయానికి రావాలని అధిష్టానానికి సూచిస్తున్నారు.
పులివెందుల స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన డాక్టర్ వైఎస్సార్ అకాల దుర్మరణంలో వచ్చే నెలలో ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెల్సిందే. సాధారణంగా ఒక ప్రజాప్రతినిధి అకాలమరణం చెందితే ఆ సీటును ఆయన కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు. దీంతో అక్కడ ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దూరంగా ఉంచుతాయి.
ఇదే ఆచారాన్ని పులివెందులలో కూడా కొనసాగించాలని తెదేపా సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇందుకోసం ఆయన గతంలో చోటు చేసుకున్న జీఎంసీ బాలయోగి హెలికాఫ్టర్ ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చారు. అయితే, మరికొందరు తెదేపా నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు.
అప్పటి రాజకీయ, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. పులివెందుల పోటీపై మరో సీనియర్ నేత స్పందిస్తూ.. పోటీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. అధిష్టానం చర్చించి, ఓ నిర్ణయానికి వస్తుందన్నారు.