కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన వ్యతిరేక వర్గం లోలోన రగిలిపోతోంది. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన మంత్రుల సమక్షంలోనే జగన్ ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎండగట్టారు. ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ శ్రేణులతో సహా వ్యతిరేక వర్గాన్ని విస్మయానికి గురిచేసింది.
దీంతో వైఎస్ జగన్ వర్గం దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వ్యతిరేకవర్గం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో కాంగ్రెస్ వృద్ధనేతలంతా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జగన్ మీడియా సమావేశం పెట్టిన మరుక్షణమే సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇంటిలో ఈ సీనియర్లంతా భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే, సీనియర్లుగా చెలామణి అవుతున్న కే.కేశవరావు, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కేఆర్.అమోస్, కమలాకర్ రావు, శంకర రావు, జనారెడ్డి, దివాకర్ రెడ్డి, ఎంపీలు మధుయాష్కీ, హర్షకుమార్, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తదితరులు తమ పట్టును నిలబెట్టుకునేందుకు ఏదో ఒక ఉద్యమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.
తెలంగాణా ప్రాంతానికి చెందిన నేతలు తిరిగి తెలంగాణా ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని రావాలని భావిస్తున్నారు. దీనికి ఆంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం అడ్డు చెపుతుండటం మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అటు జగన్, ఇటు వ్యతిరేక వర్గానికి సమానదూరం పాటిస్తూ తన పని చేసుకుని పోతున్నారు. మొత్తం మీద జగన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. ఇవి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.