రోశయ్య సర్కారుకు "పక్కలో బల్లెం" వైఎస్ జగన్!?
, శనివారం, 24 అక్టోబరు 2009 (10:59 IST)
'
ముఖ్యమంత్రి ఎవరనేది తమకు పనిలేదు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం. ఓ తండ్రి కార్యసాధనలో అశువులు బాస్తే కొడుకుగా దాన్ని పూర్తి చేయాలని భావించడం తప్పులేదు'. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్ చేసిన వ్యాఖ్యలు. తన తండ్రి మరణానంతరం తన అనుచరగణంతో మీడియాతో ముందుకు వచ్చి మనస్సులోని అన్ని విషయాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యలో ఎంతో నిగూఢార్థం దాగివుంది. భవిష్యత్‌లో అటు ముఖ్యమంత్రితో పాటు.. ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారుతామనే ముందస్తు హెచ్చరికలు చేశారు. పైపెచ్చు.. గత కొంత కాలంగా కనిపించని గ్రూపు రాజకీయాలు మళ్లీ తెరపైకి తెచ్చేలా వైఎస్ జగనే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. శుక్రవారం జగన్ నిర్వహించిన మీడియా సమావేశమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా జగన్ చేసిన నిగూఢ ప్రకటనలో కాంగ్రెస్‌లోని గ్రూపు ముఠాలన్నీ ఒక్కసారి మేల్కొన్నాయి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటూనే.. మరోవైపు రాష్ట్రంలో మందిమార్భలంతో పాటు పట్టును పెంచుకునేందుకు జగన్ వ్యూహ రచన చేశారు. అందులోభాగమే పలువురు మంత్రులు, ఎంపీలు, అనుచరులు, కీలక నేతలను దగ్గర పెట్టుకుని మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ప్రవేశపెట్టిన పేదల పథకాల అమలులో వేగం మందగించిందని ఆరోపించారు. వైఎస్ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రితో తమకు పని లేదని స్పష్టం చేశారు. మనముందు ఉన్న ఏకైక సవాల్... లక్ష్యం.. ఒక్కటే. వైఎస్ ఆశయాలను నెరవేర్చడమే అంటూ విస్పష్టమైన ప్రకటన చేసి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టించారు.