'సుక్కల్లో చక్కనోడి'కి కన్నీటి వీడ్కోలు
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (18:00 IST)
ప్రియతమ నాయకుడు, జనహృదయ నేత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆశేష జనం శతకోటి అశ్రునివాళలు అర్పించారు. బహుదూరపు బాటసారికి లక్షలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. తన రాజకీయ ప్రస్థానానికి తన వెన్నంటి ఉన్న స్వంత జిల్లా కడప వాసులు ఆయనకు ఘన వీడ్కోలు పలికారు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ ఎస్టేట్‌లో ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ముగిశాయి. కటుంబసభ్యులు, ఆత్మీయులు గుండెను బండగా చేసుకుని తమ ప్రియతమ ఆప్తునికి తుది వీడ్కోలు పలికారు. వైఎస్‌ను చివరిసారి చూసేందుకు కడప జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇడుపులపాయ ఎస్టేట్‌కు తరలివచ్చారు. ఫలితంగా.. ఎస్టేట్ ఎటు చూసినా.. అశేష జనసంద్రాన్ని తలపించింది. వీర అశ్రునివాళుల మధ్య అంతక్రియలు పూర్తయ్యాయి. అపర భగీరథునిగా పేరుగాంచిన ప్రియతమ నేతకు.. పసి పిల్లావాడి నుంచి, ప్రముఖుల దాకా లక్షాలది మంది హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు వైఎస్ పార్థివశరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో దివంగత ముఖ్యమంత్రి భౌతికకాయాన్ని ఇడుపులపాయ ఎస్టేట్‌కు తరలించారు. హెలికాఫ్టర్‌లోనే ఆయన పార్థీవ శరీరాన్ని కుటుంబ సభ్యులకు చివరిసారిగా చూపించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఆయన ఆప్త మిత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, ఆయన ప్రాణమిచ్చే రైతులు లక్షలాది సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వైఎస్ అంత్యక్రియలకు హాజరై తుదివీడ్కోలు పలికారు.