సీఎం పదవికి జగన్ అర్హుడే: వీరప్ప మొయిలీ
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (16:51 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అర్హుడేనని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. జగన్ యువకుడు మాత్రమే కాకుండా చురుకైన వ్యక్తి అని ఆయన కితాబిచ్చారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనన్నారు. అయితే, ముఖ్యమంత్రి వారసుని ఎంపికలో సీఎల్పీదే తుది నిర్ణయమన్నారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్.జగన్ పేరును బలపరుస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ కూడా రాసింది. అలాగే, రాష్ట్రానికి 33 ఎంపీలలో ఎక్కువ మంది వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, వైఎస్సార్ మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నందున ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇప్పటికే నేతలకు సూచించారు.