శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతులకు రక్షణ కల్పించవలసిందిగా ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా వారిరువురికి ఎటువంటి హాని తలపెట్టబోమంటూ చిరంజీవి కుటుంబసభ్యులు హామీ పత్రాన్ని అందించాలని కోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ, శిరీష్‌లు ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో తమకు ప్రాణాపాయం కలుగుతుందని, తమకు రక్షణ కల్పించాలంటూ శ్రీజ దంపతులు ఢిల్లీ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తనవల్ల శ్రీజ దంపతులకు ఎటువంటి హానీ కలుగదని సినీ నటుడు, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సోమవారం విలేకరులతో స్పష్టం చేశారు. శ్రీజ ఎక్కడ ఉన్నా సుఖసంతోషాలతో ఉండాలని సోదరుడు చిరంజీవి, తాము ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.