అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఛైన్ గ్రూప్ ఛాయిస్ హోటల్ సంస్థ వచ్చే మూడేళ్ళలో దేశ వ్యాప్తంగా 20-30 హోటల్స్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతోందని, అలాగే, మౌలిక సదుపాయాల రంగంలో కూడా వేగం పుంజుకుందని అంచనా వేసింది. అందువల్లే వచ్చే మూడేళ్ళలో ఈ హోటల్స్‌ను నెలకొల్పాలని భావిస్తోంది.
అమెరికాకు చెందిన ఈ హోటల్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఛాయిస్ హోటల్స్ ఇండియా (సీహెచ్‌ఐ) సంస్థ ప్రస్తుతం దేశంలో 28 హోటల్స్‌ను నడుపుతోంది. దీనిపై సీహెచ్ఐ సీఈఓ విసాల్ పవార్ పీటీఐతో మాట్లాడుతూ వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో యేడాదిగి 20-30 హోటల్స్‌ను ప్రారంభించాలన్నదే లక్ష్యమన్నారు.
2011 సంవత్సరంలో 14 హోటల్స్‌ను ప్రారంభించనున్నట్టు, ప్రధానంగా ఇవన్నీ ద్వితీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ హోటల్స్ నిర్మాణం వివిధ స్థాయిల్లో ఉన్నాయన్నారు. అలాగే, తమ సంస్థ వృద్ధి రేటును రెండంకెలుగా చూడాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు.
తమ హోటల్స్‌లో ఒక రాత్రి బస చేసేందుకు రూ.2000 నుంచి రూ.7000 వరకు కస్టమర్ ఛాయిస్‌కు తగ్గుట్టుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వసూలు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఉన్న తమ హోటళ్ళు స్లీప్ ఇన్, కంఫర్ట్ ఇన్, క్వాలిటీ ఇన్, క్లారియన్, కంబ్రియా బ్రాండ్‌లతో ఉన్నాయన్నారు.
ఈ హోటల్స్ న్యూఢిల్లీ, ముంబై, చెన్నయ్, అహ్మదాబాద్, బంగళూరు, గుర్గాన్, హైదరాబాద్, జైపూర్, కొడైక్కెనాల్, లక్నో, ఫరీదాబాద్, అమృతసర్, షిమ్లా, మణలి, కార్పెట్, పూణె, నాసిక్, ట్యుటికోరిన్, విజయవాడలలో ఉన్నాయన్నారు.