ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల యూపీఏ పాలకులను హడలెత్తిస్తోంది. గత వారంలో 18.31 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం జనవరి ఒకటో తేదీతో ముగిసిన వారాంతానికి 16.91 శాతానికి పడిపోయింది. ఇంత మొత్తంలో ద్రవ్యోల్బణం ఉండటాన్ని ఆర్థిక శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 19వ తేదీన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ భేటీకానున్నారు.
దీనిపై మంత్రి ప్రణబ్ మాట్లాడుతూ ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయిలో అంగీరించలేమన్నారు. దీన్ని వీలైనంత మేరకు తగ్గించేందుకు రాష్ట్రాల సహకారంతో తమ శాయశక్తులా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 19వ తేదీన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నట్టు చెప్పారు.
కాగా, ఆరు వారాల తర్వాత 16.91 శాతానికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. అయినప్పటికీ.. ఉల్లిపాయలతో పాటు ప్రోటీన్‌తో కూడిన ఆహార పదార్థాల ధరలు మండుతున్నాయి. వీటీతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా డిసెంబరులో 7.48 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 8.43 శాతానికి చేరుకుంది.