ఈనెల 27వ తేదీ నుంచి సరకుల రవాణా ఛార్జీలను నాలుగు శాతం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపు నుంచి నిత్యావసరవస్తువులకు మినహాయింపు ఇచ్చింది. ఈ పెంపుపై గుజరాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సౌరభ్ పటేల్ మండిపడ్డారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గుజరాత్ విద్యుత్ రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు అదనపుభారం కానుందని ఆయన గుర్తు చేశారు.
విద్యుత్ ఉత్పత్తి ధర పెరగడం వల్ల ఖచ్చితంగా ఇంధన సర్‌ఛార్జ్ పెరుగుతుందన్నారు. సరకుల రవాణా ఛార్జీల పెంపుదల రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువగా నేలబొగ్గు ఆధారిత ప్లాంట్‌లని ఆయన గుర్తు చేశారు.
ఈ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి గుజరాత్ దిగుమతి చేసుకుంటుండగా, ఈ రవాణా ఎక్కువగా గూడ్సురైళ్ల వ్యాగన్‌ల ద్వారానే తరలిస్తున్నారని గుర్తు చేశారు.