కట్టుకున్న భార్య మానసిక రోగంతో బాధడుతుందని ఒక యేడాది పాటు మరుగుదొడ్డిలో భర్త బంధించాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా, రిష్పూర్ అనే గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 35 యేళ్ళ ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు, భర్త ఉన్నాడు. అయితే, తన భార్య మానసిక రోగంతో బాధపడుతుందని పేర్కొంటూ ఒక యేడాది పాటు మరుగుదొడ్డిలో బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో బలహీనంగా ఉన్న మహిళను అధికారులు కాపాడి సివిల్ ఆసుపత్రికి తరలించారు.
దీనిపై మహిళా రక్షణ అధికారి రజనీగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్డిలో దయనీయమైన పరిస్థితుల్లో పడుకున్న మహిళను అధికారులు కాపాడారు. బాధిత మహిళ బలహీనంగా ఉందని, నడవలేకపోయిందని, ఆమెకు ఆహారం ఇచ్చామని గుప్తా చెప్పారు.
బందీఖానాలో బాధత మహిళకు సరైన ఆహారం, తాగునీరు కూడా ఇవ్వలేదని అధికారులు చెప్పారు. బాధిత మహిళకు 17 సంవత్సరాల క్రితం నరేష్ కుమార్‌తో వివాహం అయిందని, వారికి 15, 11, 13 సంవత్సరాల వయసు గల పిల్లలున్నారని అధికారులు చెప్పారు.
తన భార్యకు మానసిక ఆరోగ్య సమస్య ఉందని భర్త నరేష్ కుమార్ చెబుతున్నా, బాధితురాలు కుటుంబ సభ్యులందరినీ గుర్తించారని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని అధికారులు చెప్పారు. భార్యను బంధించిన భర్త నరేష్ కుమార్‌పై ఐపీసీసెక్షన్ 498ఏ, 342 కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి సురేందర్ చెప్పారు.