Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్ రిజిర్వేషన్ లో మనం కోరుకున్న సీటు దొరకదు ఎందుకు?

రైల్ రిజిర్వేషన్ లో మనం కోరుకున్న సీటు దొరకదు ఎందుకు?
, మంగళవారం, 15 జూన్ 2021 (08:18 IST)
సినిమా హాల్లో మనకు నచ్చిన నంబరు సీటును మనం బుక్ చేసుకోవచ్చును.  కాని, ఐఆర్సీటీసీలో మనం టికెట్లు బుక్ చేసుకునేటపుడు అది మహా అయితే అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా లేక లోయర్ బెర్త్ కావాలా అని మాత్రమే అడుగుతుంది కాని, ఒక బోగీలో 72 బెర్త్ లు ఉంటాయి కదా, అందులో మీ లక్కీ నంబరు బెర్తు కావాలా అని మాత్రం అడుగదు.  ఎందుకు?   
 
దీని వెనుక భౌతికశాస్త్రపు ప్రాథమిక సాంకేతికాంశాలు ఉన్నాయి కాబట్టి. సినిమాహాలులో సీటు బుకింగు  వేరు, రైలులో సీటు బుకింగు వేరు. సినిమా హాలు నిశ్చలంగా ఉండే ఒక విశాలమైన గది మాత్రమే.  కాని, రైలు ఒక పరుగెత్తే గదుల సమూహం.
 
ఆ పరుగు ప్రయాణీకులకు ప్రమాదకరంగా ఉండరాదు, వారి ప్రయాణం క్షేమంగా జరగాలన్నది చాల ముఖ్యమైన విషయం.  అందువల్ల రైలులో ప్రయాణమయ్యే బరువు రైలంతటా సమానంగా పంపకమయ్యే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానపు సాఫ్ట్ వేర్ ను రూపుదిద్దారు.
 
ఉదాహరణకు – ఒక రైల్లో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాసు బోగీలు ఉన్నాయనుకుందాం.  ఒకొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి.  అందువల్ల, మొట్టమొదట టికెట్ బుక్ చేసుకునేవారికి నడుమనున్న బోగీలో (S5 లేదా S6లో) టికెట్ కేటాయింపబడుతుంది.  పైగా అందులో కూడా, 30 – 40 నంబరు సీటు కేటాయింపబడుతుంది. 

అందులోనూ, లోయర్ బెర్త్ కేటాయింపబడుతుంది.  (ఎటువంటి బెర్త్ కావాలో మన ఎంపిక లేకపోతే)   రైలులో గ్రావిటీ సెంటర్లు (గరిమనాభి కేంద్రాలు) సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గాను, అప్పర్ బెర్త్ ల కంటే ముందుగా లోయర్ బెర్త్ లను కేటాయించడం జరుగుతుంది.
 
ఇలా మొదటగా మధ్యలో ఉండే బోగీలలో మధ్య సీట్లు, అలాగే క్రమంగా చివరి సీట్లు, (మొదట లోయర్ బెర్త్, ఆ తరువాతనే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్) కేటాయింపబడతాయి.  ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో (S4, S7) మరలా అదే విధంగా సీట్ల కేటాయింపు జరుగుతూ పోతుంది.  
 
ఇలా బరువు అన్ని రైలు బోగీలలోనూ సమానంగా ఉండే విధంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. మనం చివరి నిమిషాలలో టికెట్ కోసం ప్రయత్నించినపుడు మనకు అప్పర్ బెర్త్ లు, 1-6 లేదా 66-72 నంబరు సీట్లు, కేటాయింపబడటానికి కారణం ఇదే.  మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీటు క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీటు దొరకవచ్చు.
 
ఈ విధానంలో కాకుండా ఐఆర్సీటీసీ తనకు నచ్చిన బోగీలో నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటూ పోతే ఏం జరుగుతుంది?..  S1 S2 S3  బోగీలు ప్రయాణికులతో నిండుగా కిటకిటలాడుతున్నాయి, S5 S6 బోగీలు ఖాళీగా ఉన్నాయి, మిగిలిన బోగీలలో ప్రయాణికులు అరకొరగా ఉన్నాయనుకుందాం. 

ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒకొక్కసారి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగెడుతుంటాయి.  అంతటి వేగం వలన చాల బలమైన గమనశక్తి పుడుతూ ఉంటుంది.  అంతటి వేగంలో రైలు మలుపు తిరగవలసి వచ్చిందనుకోండి.  ఆ సమయంలో అసమభారం కలిగిన (అనీవెన్లీ లోడెడ్) బోగీలన్నిటిమీద కేంద్రపరాఙ్ముఖబలం (సెంట్రి-ఫ్యూగల్ ఫోర్స్) సమానంగా ఉండటం సాధ్యం కాదు. 

అందువల్ల అంతటి వేగంలో బరువు కలిగిన బోగీలు ఒకవైపు ఈడ్వబడితే బరువు లేని బోగీలు మరొకవైపు బలంగా విసిరివేయబడతాయి.  అప్పుడు రైలు పట్టాలు తప్పే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.  
 
అంతే కాదు, అసమానమైన బరువు కలిగిన బోగీలు రైలులో ఉన్నపుడు రైలుకు బ్రేకులు వేస్తే అన్ని బోగీలమీదా సమానమైన వత్తిడి పడదు.  అప్పుడు కూడా రైలు చలనం మీద డ్రైవరుకు అదుపు తప్పవచ్చు.
 
మాకు అనుకూలమైన సౌకర్యవంతమైన సీట్లు బెర్తులు కేటాయించలేదని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను నిందించే వారికి అసలు విషయాన్ని కారణాలను వివరించేందుకు ఇది ఒక ప్రయత్నం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముత్యాలు మెడకు చున్నీ బిగించి చంపేసిన భార్య - ప్రియుడు