కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదని.. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రియేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ వారానికి 50 వేల కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచం కోరుకున్నప్పుడే ఈ మహమ్మారిని అంతమొందిచగలమని టెడ్రోస్ చెప్పారు. తమ జనాభాలో 40 శాతంపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించిన జీ20 దేశాలు ఇకపై కోవ్యాక్స్‌పై దృష్టి సారించాలని కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్స్ మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అలాగే ఆఫ్రికా దేశాల కోసం ఆఫ్రికన్ వ్యాక్సిన్ అక్విషన్ ట్రస్ట్ (ఏవీఏటీ) అనే స్వచ్ఛంద సంస్థ కూడా వ్యాక్సిన్ సేకరణ కోసం కృషి చేస్తోంది. జీ20 దేశాలు ఈ రెండు పథకాల్లో యాక్టివ్‌గా పాలుపంచుకోవాలని టెడ్రోస్ విజ్ఞప్తి చేశారు.