దేశ రాజధాని ఢిల్లీని ఆలస్యంగా రుతుపవనాలు తాకాయి. ఈ సంవత్సరం దాదాపు 16 రోజుల ఆలస్యంగా చేరుకున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా చేరుకున్నా.. భారీ వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది.
కేవలం మూడు గంటల్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు జూలై నెలలో 14 రోజుల పాటు వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా పోటెత్తింది.
జూలైలో ఇప్పటి వరకు నగరంలో 381 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే అధిక వర్షపాతమని ఐఎండీ అధికారులు వెల్లడిస్తున్నారు. 2013, జూలై 21వ తేదీన 123.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.
సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27వ తేదీ వరకు 108 శాతం అధిక వర్షపాతం రికార్డయిందని ఐఎండీ వెల్లడిస్తోంది. అయితే..గత కొద్ది సంవత్సరాలుగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ షలావత్ పేర్కొన్నారు.
ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరగవని, వర్షాలు నెమ్మదిగా ఉంటే.. భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరాల్లో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు.