వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న పదిహేనేండ్ల బాలికపై పొరుగున ఉండే యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. యూపీలోని మీరట్ జిల్లా సర్ధానా పట్టణంలోని మొహల్లా ఖేవన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక గర్భం దాల్చిన అనంతరం ఈ వ్యవహారం ఆలస్యంగా బయటకివచ్చింది.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని తెలిసింది. బాలిక కుటుంబ సభ్యులు ఈ దారుణ ఘటనపై పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా బాలిక ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని, వైద్యుని వద్దకు తీసుకువెళ్లగా ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని తేలిందని బాధితురాలి తల్లి చెప్పారు.
బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో వచ్చిన యువకుడు ఆమెను బలవంతంగా లోబరుచుకున్నాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమెతో సహా కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరించాడని తెలిపారు.