దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. జనాలంతా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ యువత మాత్రం కరోనాను లెక్క చేయకుండా అక్కడక్కడ గుంపుగా వుండటం.. క్యారంబోర్డు ఆడటం వంటివి చేస్తున్నారు. దొంగచాటుగా ఆడుకుంటూ లాక్ డౌన్‌ను లెక్క చేయట్లేదు. ఇలా లాక్ డౌన్‌ను లెక్క చేయకుండా వారిని కనుగొనేందుకు ప్రస్తుతం డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు.
ఈ డ్రోన్లు ఆకాశంలో ఎగురుతూ లాక్ డౌన్‌ను ఉల్లంఘించే వారిని కనిపెట్టేస్తోంది. ఇలాంటి ఘటనే ప్రస్తుతం తిరుప్పురూలో చోటుచేసుకుంది. క్యారంబోర్డు ఆడుతూ గుంపుగా వుండిన కొందరు యువకులు డ్రోన్ వస్తుందని గమనించి పరుగో పరుగు అంటూ పారిపోయారు. వెళ్తూ వెళ్తూ బైకును, క్యారంబోర్డు నెత్తినెట్టుకుని పరుగులు తీసిన వీడియోను తిరుప్పూరు పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో లాక్ డౌన్ అమలులో వున్న సంగతి తెలిసిందే. ఇలా లాక్ డౌన్లో ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారా అని తెలుసుకునేందుకు తిరుప్పూరు పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇలా డ్రోన్ తిరుగుతుండగా.. ఓ చెట్టుకింద గుంపుగా క్యారంబోర్డు ఆడిన యువకులు డ్రోన్ కంట పడ్డారు.
ఇంకా డ్రోన్ వచ్చిన విషయాన్ని గమనించిన యువకులు పరుగులు పెట్టారు. పరిగెడుతూ బైకును, క్యారంబోర్డును మరిచారు. మళ్లీ తిరిగొచ్చి వాటిని తీసుకుని పారిపోయారు. ఇలా క్యారంబోర్డుతో పరుగులు తీసిన యువకుడు డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ఆ బోర్డును నెత్తిన పెట్టుకుని తలదాచుకున్నాడు. ఈ వీడియోపై ప్రస్తుతం మీమ్స్ పేలుతున్నాయి. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ చూసి నవ్వుకోండి..