Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ టెక్నాలజీపై అపార నమ్మకం కలిగింది.. అప్పటి నుంచే రిస్క్ తీసుకుంటున్నా : ఆనంద్ మహీంద్రా

anand mahindra

ఠాగూర్

, గురువారం, 21 మార్చి 2024 (13:19 IST)
తన కుమార్తె చిటికెన వేలి ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లగా ప్రపంచంలోనే టాప్ సర్జన్ ముంబైలోనే ఉన్నారని విదేశీ వైద్యులు వెల్లడించడంతో తాను ఆశ్చర్యపోయినట్టు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆ తర్వాత ఓ చిన్న చిట్కాతో ముంబై డాక్టర్ తన కుమార్తె కోలుకునేలా చేశారని, అప్పటి నుంచి భారతీయ టెక్నాలజీపై తనకు అపారమైన నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో జరిగిన 4వ అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక ఉపన్యాసాల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, తన కూతురి ఆపరేషన్ గురించి, ఆ క్లిష్ట సమయం నేర్పిన గుణపాఠం గురించి వివరించారు. ఈ ప్రసంగం వీడియోను ఆర్పీజీ గ్రూప్ చైర్ పర్సన్ హర్ష గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
యేడాది వయసున్నప్పుడు తన కూతురి చేతివేలి ఆపరేషన్ ఎలాంటి మలుపులు తిరిగిందో ఆనంద్ మహీంద్రా కళ్లకు కట్టినట్టు వివరించారు. అది 1987.. అప్పట్లో ఏడాది వయసున్న నా చిన్న కూతురు నడవడం నేర్చుకుంటోంది. ఆ సమయంలో ఆమె ఓ చిన్న గాజు సీసా పట్టుకుని కిందపడటంతో చిన్న గాజు ముక్క ఆమె చేతివేలిలోని టెండాన్‌ను (కండను, ఎముకను కలిపే కణజాలం) తెంపింది. దీంతో టెన్షన్ పడిపోయిన నేను కొందరి సలహా మేరకు వెంటనే లండన్‌లోని ప్రముఖ మైక్రోసర్జరీ డాక్టర్‌ను సంప్రదించా. ఆపరేషన్ చేసిన ఆయన.. చిన్నారి కోలుకునేందుకు చేయి కదల్చలేని విధంగా చేయి చుట్టూ ఓ కాస్ట్ వేశారు. 
 
నెల రోజుల పాటు ఎంతో టెన్షన్‌గా వేచి చూశాక కాస్ట్ తీస్తే నా కూతురు చేతివేలు కదపలేకపోయింది. శస్త్రచికిత్స ఫెయిలైందని తెలిసి సర్జన్ కూడా షాకైపోయారు. ఆ తర్వాత మరో సలహా మేరకు ప్యారిస్‌లోని మరో సర్జన్ డా.గ్లిష్‌స్టైన్‌ను సంప్రదించాము. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ మమ్మల్ని చూసి... మీరు డా.జోషీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. తెల్లమొహం వేసిన నేను ఆయన ఎవరని ప్రశ్నించాను. ప్రపంచంలో అత్యంత ప్రముఖ హ్యాండ్ సర్జన్లలో ఆయన ఒకరని డా.గ్లిష్‌స్టైన్ తెలిపారు. ఆయన భారతీయుడని, ముంబైలోనే ఉంటారని చెప్పారు. తమకంటే ఆయనకే ఎక్కువ అనుభవం ఉందని అన్నారు. భారత్‌లో అనేక మందికి చేతిగాయాలు అవుతుండటంతో వారికి చికిత్స చేసే క్రమంలో అపార అనుభవం గడించారని చెప్పినట్టు తెలిపారు. 
 
ఆ తర్వాత ఆయనే డాక్టర్ జోషి చిరునామా కూడా ఇచ్చారని తెలిపారు. ఇంతకీ ఆయన క్లినిక్ మా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. వెంటనే స్వదేశానికి వచ్చి ఆయనను కలిశాము. ఆ మరుసటి రోజే డా. జోషి నా కూతురికి మళ్లీ ఆపరేషన్ చేశారు. ఈ తరహా కేసుల్లో ఆపరేషన్ కంటే పేషెంట్ ఎలా కోలుకుంటారనేదే కీలకమని డా. జోషి వివరించారు. గాయాన్ని మాన్పించే క్రమంలో వేలిలో ఏర్పడే కొత్తకండరం వేలి కదలికలకు అడ్డంకిగా మారుతుందని వివరించారు. 
 
దీన్ని నివారించేందుకు డా.జోషి చూపించిన సులువైన పరిష్కారం నా మతి పోగొట్టింది. ఆయన.. చిన్నారి చేతివేలికి ఓ చిన్న హుక్ (బ్లౌస్ హుక్ లాంటిది) జతచేశారు. ఆ తర్వాత మణికట్టు వద్ద మరో బ్యాండేజ్ చుట్టి దానికి మరో హుక్ తగిలించారు. ఈ రెండింటినీ ఓ రబ్బర్ బ్యాండ్ జతచేశారు. ఈ పరికరం ఖర్చు జస్ట్ రూ.2. ఇది వేలికదలికలకు అవకాశం ఇస్తూనే గాయం పూర్తిస్థాయిలో నయమయ్యేలా చేసింది. మరో పదేళ్ల తర్వాత నా కూతురు పియానో కూడా వాయించింది" అని ఆయన చెప్పుకొచ్చారు.
 
'ఈ ఉదంతం గురించి నేను చాలా సార్లు చెప్పాను. మన సమస్యలకు పరిష్కారాలు సాధారణంగా మనకు సమీపంలోనే ఉంటాయని, ప్రతిసారీ విదేశాలవైపు చూడనక్కర్లేదన్న గుణపాఠం నేర్చుకున్నాను. ఇది నా కెరీర్‌ను మార్చేసింది. భారతీయ టెక్నాలజీని ఆ తర్వా మరెప్పుడూ సందేహించలేదు. భారతీయ టెక్నాలజీపై నమ్మకంతోనే భారీ పెట్టుబడులు పెట్టా.. రిస్క్ తీసుకున్నా. 1990ల్లో స్కార్పియో కారు విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకున్నా. నేటి విజయానికి అదే మూలం' అని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.66,778లతో చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు