పన్నీరును టార్గెట్ చేసిన పళని.. అవినీతి చిట్టా విప్పమని ఆదేశాలు..
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఈమె జైలు జీవనం గడుపుతుంటే.. తాజాగా ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈసీకి లంచం ఇవ్వజూపారని పోలీసుల అ
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఈమె జైలు జీవనం గడుపుతుంటే.. తాజాగా ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈసీకి లంచం ఇవ్వజూపారని పోలీసుల అదుపులో ఉన్నారు. దీంతో శశికళ కుటుంబాన్ని అన్నాడీఎంకే దూరం చేయాలని మాజీ సీఎం ఓపీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం చిన్నమ్మను వదిలేది లేదని తేల్చేసినట్లు సమాచారం. దీంతో ఓపీఎస్-పళని సామి వర్గాల విలీనం ఇక లేదని దాదాపు ఖాయమైపోయింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్ సెల్వం అవినీతి చిట్టాను విప్పాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పళనిస్వామి మాట్లాడుతూ తమ సత్తా ఏంటో, తమకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారో చెబుతూ విలీనం ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు. ఇంకా ఓపీఎస్ అవినీతి ఏంటో బయటకు తీయాలని ఆదేశాలు జారీ చేయడం తమిళనాట కలకలం రేపుతోంది.
ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం ఆరేళ్ల కాలంలో చేసిన అవినీతి జాబితాను బయటకు తీసి సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. మే 5వ తేదీ నుంచి పన్నీర్ రాష్ట్ర పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఆయన అవినీతి రికార్డును బయటపెట్టాలని చెప్పడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.