Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇకలేరు..

ssmkrishna

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (08:29 IST)
కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత విదేశాంగ మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఎస్ఎం కృష్ణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న తన స్వగృహంలో మృతి చెందారు. 
 
ఎస్ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరును టెక్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరును ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయనదే. 
 
ఎస్ఎం కృష్ణ 1932 మే ఒకటో తేదీన మాండ్య జిల్లాలోని సోమనహళ్లిలో జన్మించారు. జీవితాంతం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన తన రాజకీయ జీవితం ఆఖరులో బీజేపీలో చేరారు. కాగా, ఆయన రాజకీయ జీవితం 1962లో మద్దూరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కర్ణాటక అసెంబ్లీ సభ్యుడిగా మారడంతో ప్రారంభమైంది. 
 
ఎస్ఎం కృష్ణ మైసూరులోని మహారాజా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు. అనంతరం ఆయన డల్లాస్ లోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Minister Post to Nagababu ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!!