'ఒకే దేశం - ఒకే ఎన్నిక' బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి కేంద్రం పంపించింది. ఈ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ, రాజ్యాంగ సవరణకు అనేక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా, జేపీసీకి పంపించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించింది. ఈ బిల్లును పరిశీలించే జేపీసీ నామీనీ జాబితాలో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి మనీశ్ తివారీ, రణ్‌దీప్ సూర్జేవాలా, సుఖ్‌దేవ్ భగత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే, సభ్యులుగా కల్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేల పేర్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాగా.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
కాగా, మంగళవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా 90 నిమిషాలపాటు చర్చ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఇందులో బిల్లుకు అనుకూలంగా 269 మంది.. వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు.
అయితే.. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీకి పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో ఈ బిల్లును జేపీసీకి పంపారు. ఈ కమిటీలో ప్రియాంక గాంధీ కూడా సభ్యురాలు కానున్నట్లు తెలుస్తోంది.