రహస్య ఓటింగ్‌కు డిమాండ్: తమిళనాడులో బలపరీక్షలు మామూలే..?
శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి భవిష్యత్తును తేల్చివేసే ఓటింగ్ మొదలుకానుంది. కానీ శుక్రవారం వెంటవెంటనే జరిగిన పరిణామాలు రేపటి బలపరీక్షను రసవత్తరంగా మార్చేశాయి. శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం స్వేచ్చగా ఓటేయాల
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షతో బలాబలాలను తేల్చే ప్రక్రియకు మరికొద్ది గంటల సమయమే ఉంది. శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి భవిష్యత్తును తేల్చివేసే ఓటింగ్ మొదలుకానుంది. కానీ శుక్రవారం వెంటవెంటనే జరిగిన పరిణామాలు రేపటి బలపరీక్షను రసవత్తరంగా మార్చేశాయి. శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం స్వేచ్చగా ఓటేయాలంటే అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షను రహస్యంగా చేపట్టాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ధనపాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాంప్‌లో అనేకమంది ఎమ్మెల్యేను నిర్బంధించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బలపరీక్షలో ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాలను, కార్యాలయాలను ముట్టడించారు. పన్నీర్ అనుకూలంగా ఓటెయ్యకపోతే నియోజకవర్గాల్లో తిరగలేరని హెచ్చరించారు.
తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు.
1988లో ఎంజీ రామచంద్రన్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్ పీహెచ్ పాండ్యన్ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది. నేడు జరుగనున్న బలపరీక్ష ఎవరికి పరీక్ష కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.