ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, ఆక్సిజన్ లభించక అనేక ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆక్సిజన్ ప్రైవేటుగా కొనుగోలు చేసినప్పటికీ ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకునేందుకు బెడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కరోనా రోగి కోసం వృద్ధుడు తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో తన బెడ్‌ను త్యాగం చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటికెళ్లిన మూడు రోజుల్లో ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన 85 యేళ్ల నారాయణ్ దబల్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఈ నెల 22న అతికష్టం మీద ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ లభించడంతో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు.
మరోవైపు ఒక మహిళ కరోనా సోకిన తన 40 ఏండ్ల భర్తను ఆసుపత్రిలో చేర్చుకోవాలని వైద్యులను ప్రాధేయపడటాన్ని నారాయణ్ చూశారు. తనకు 85 ఏండ్లని, జీవితాన్ని అనుభవించినవాడినని ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటం ముఖ్యమని డాక్టర్లకు ఆయన చెప్పారు.
ఆ దంపతుల పిల్లలు చిన్నవారని, దయచేసి తన బెడ్‌ను అతడికి ఇవ్వాలని కోరాడు. అయితే ఆయన ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని, ఆసుపత్రిలో చికిత్స పొందడం అవసరమని వైద్యుడు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు.
ఇంటికి వెళ్లేందుకే నారాయణ్ మొగ్గుచూపారు. తన కుమార్తెను రప్పించి పరిస్థితిని వివరించారు. చివరి రోజుల్లో ఇంట్లో అందరితో గడపాలని ఉందన్నారు. దీంతో నారాయణ్‌ను కుమార్తె ఇంటికి తీసుకెళ్లగా మూడు రోజుల అనంతరం మంగళవారం ఆయన కరోనాతో చనిపోయారు. దీంతో యంగ్ వ్యక్తికి ఆసుపత్రిలో బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మరోవైపు ఎవరి కోసమైతే నారాయణ్ ఆసుపత్రిలో తన బెడ్‌ను త్యాగం చేశారో ఆ వ్యక్తికి దానిని కేటాయించలేదని సిబ్బంది ద్వారా తెలిసింది. ఆసుపత్రిలో బెడ్‌ను ఏ రోగికి కేటాయించాలి అన్నది వైద్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అయితే ఖాళీ అయిన ఆ బెడ్‌ను అప్పటికే ఎదురుచూస్తున్న కరోనా రోగులలో అత్యవసరమైన వారిలో ఒకరికి కేటాయించినట్లు సమాచారం.