తారాస్థాయిలో ఎస్పీ సంక్షోభం... అత్యవసర సమావేశం రద్దు... సైకిల్ గుర్తు నాదేనంటున్న ములాయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పార్టీపై పట్టుకోల్పోతున్నారు. దీంతో పార్టీ నేత అమర్‌సింగ్‌తో కలిసి సోమవార
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పార్టీపై పట్టుకోల్పోతున్నారు. దీంతో పార్టీ నేత అమర్‌సింగ్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు. పార్టీ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో సైకిల్ గుర్తును కాపాడుకునేందుకు ములాయం ప్రయత్నాలు చేస్తున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం తాను ఏర్పాటు చేసిందని.. దానిపై తనకే పూర్తి హక్కులు ఉంటాయని ములాయం సింగ్ స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను ఎవరూ తప్పు పట్టలేరన్నారు. తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు.
మరోవైపు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేనా, దీంతో పాటు బాబాయ్ శివ్‌పాల్ యాదవ్‌పై వేటువేశారు. దీంతో పార్టీ నిలువునా చీలిపోయింది. ఈ చర్యతో షాక్‌కు గురైన ములాయం సింగ్ యాదవ్... ఈనెల 5వ తేదీని నిర్వహించాలని తలపెట్టిన సమావేశాన్ని రద్దు చేసినట్లు సోమవారం ఉదయం ప్రకటించారు. ఈ వారంలో యూపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు వారి స్థానాలకు వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
పార్టీలో అత్యధిక మంది అఖిలేష్ పక్షాన ఉండటంతో ఈ సమావేశానికి అతి తక్కువ మంది హాజరవుతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం సమాజ్‌వాదీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.