ఢిల్లీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో తన సత్తా చాటుతోంది. ఇందులోభాగంగా తాజాగా మహారాష్ట్రలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఈ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 96 సీట్లు సాధించి సత్తా చాటింది. మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ఆప్ పార్టీ ఎన్నికల్లో బోణీ కొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆప్ కైవసం చేసుకున్న 96 సీట్లలో 41 స్థానాలను ఒక్క యవత్మాల్ జిల్లా నుంచే గెలుపొందడం విశేషం. 13 జిల్లాల్లోని 300 స్థానాలకు ఆప్ బరిలో నిలిచింది. లాతూర్, నాగ్ పూర్, షోలాపూర్, నాశిక్, గోండియా, చంద్రాపూర్, పాల్ఘర్, హింగోలి, అహ్మద్ నగర్, జల్నా, యవత్మాల్, పర్భానీ జిల్లాల్లో గెలుపు ఖాతా తెరిచింది.
రాజకీయాలతో సంబంధం లేని సంఘాలతో జట్టు కట్టి మరో 13 స్థానాలను కైవసం చేసుకుంది. 2022 బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్‍కు ఈ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్నిచ్చేవే.
కాగా, 34 జిల్లాల్లోని 14 వేల గ్రామపంచాయతీలకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. అయితే, 3,276 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు.
కానీ, తాము 6 వేలకుపైగా పంచాయతీలను గెలిచామని, తామే అతిపెద్ద పార్టీ అని బీజేపీ ప్రకటించుకుంది. మహా వికాస్ అఘాడీలోని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు కలిపి గెలిచిన స్థానాల్లో 20 శాతం కూడా బీజేపీ గెలవలేదని పాటిల్ అన్నారు.